అమరావతి, అక్టోబర్ 25: అర్నాబ్ తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల కోసం రాష్ట్రంలో 10 ఎన్‌డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు.

ప్రమాద ప్రాంతాల నుంచి ప్రజల తరలింపు, పునరావాస కేంద్రాలు, ఆహారం, తాగునీరు, వైద్యం, విద్యుత్‌ పునరుద్ధరణ వంటి అంశాల్లో సన్నద్ధతపై ముఖ్యమంత్రి సమీక్షించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, అత్యున్నత స్థాయి సన్నద్ధతతో, ముందస్తు ప్రణాళికతో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు.

సముద్రంలో వేటకు వెళ్లిన అన్ని బోట్లూ తీరానికి చేరుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా వచ్చే వరదతో రిజర్వాయర్లను నింపేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని కూడా సూచించారు.

తీరం దాటే సమయం, ప్రాంతం

అక్టోబర్‌ 28న ఉదయం నుంచి మధ్యాహ్నం లోగా బాపట్ల–విశాఖపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనాల్లో కోనసీమ–యానాం–కాకినాడ తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఈ వాయుగుండం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా సుమారు 850 కిలోమీటర్లు, కాకినాడకు సుమారు 930 కిలోమీటర్ల దూరంలో ఉంది.

బలపడే క్రమం, గాలుల వేగం

ఈ వాయుగుండం అక్టోబర్‌ 26 ఉదయానికి తుఫానుగా, అదే రోజు రాత్రికి తీవ్ర తుఫానుగా, 27న అతి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని అంచనా. తీరం దాటే సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కొన్ని సందర్భాల్లో ఈదురుగాలులు 140 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని వివరించారు. అక్టోబర్‌ 27 ఉదయం నుంచే తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత ఉండే అవకాశం ఉంది.

భారీ వర్షాల హెచ్చరిక

అక్టోబర్‌ 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాలపై గాలులు, వర్షాల ప్రభావం ఉండనుంది.

వర్షపాత అంచనాల ప్రకారం అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా సగటున 292.55 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 281.17 మి.మీ., విశాఖపట్నంలో 253.87 మి.మీ., శ్రీకాకుళంలో 249.18 మి.మీ. వర్షపాతం అంచనా. రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల సగటు మొత్తం వర్షపాతం 95 మి.మీ.గా అంచనా వేయగా, ప్రభావిత జిల్లాల్లో సగటున 22–29 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

సముద్రం అత్యంత అల్లకల్లోలంగా ఉండనున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.