పంటల బీమాపై రైతన్నలకు అవగాహన కార్యక్రమాలు

అమరావతి, నవంబర్ 3 (ఎక్స్‌ప్రెస్ టుడే): భవిష్యత్‌లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు నష్టపోకుండా బీమా రక్షణ కవచంలా నిలిచేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. పంటల బీమాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్గదర్శకాలు అందించాలన్నారు. పంటల బీమాపై వ్యవసాయ శాఖ అధికారులతో సచివాలయం నుంచి మంగళవారం ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...‘ఈ సీజన్‌లో అర్నబ్, మురసు తుఫాన్లు వెంటవెంటనే ప్రభావం చూపినప్పటికీ ఎదుర్కొనేందుకు అన్ని విధాలా చర్యలు చేపట్టాం. అయితే వ్యవసాయరంగానికి ఈ తుఫాన్ల వల్ల ఎక్కువ నష్టం వాటిల్లింది. ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి 22 రకాల పంటలను బీమాకు నోటిఫై చేశాం.

ఇందులో 15 పంటలకు దిగుబడి ఆధారిత బీమా, మరో 7 పంటలకు వాతావరణ ఆధారిత బీమా అమలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్న చర్యల ఫలితంగా పంటల బీమాలో రైతుల నమోదు గణనీయంగా పెరిగింది. పంటల బీమా కల్పించడంలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ 6వ స్థానంలో ఉంది.

ఈసారి 17.07 లక్షల మంది రైతులు సాగు చేసిన పంటలకు బీమా కల్పించాం. బీమా చేయించిన మొత్తం విస్తీర్ణంలో వరి, కందులు, వేరుశనగ, పత్తి, మిరప, మొక్కజొన్న పంటల వాటా 90 శాతంగా ఉంది. వరి పంట సాగు విస్తీర్ణంలో అధిక భాగం తుపాను ప్రభావిత 16 జిల్లాల్లోనే ఉంది.

క్లస్టర్ల వారీగా వివిధ బీమా కంపెనీలకు పంటల బీమా బాధ్యతలను అప్పగిస్తున్నాం. పంటల దిగుబడి ఆధారంగా బీమా పరిహారం నిర్ణయించే విధానాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తుఫాన్ల సమయంలో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నాం.

పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ రెండూ అందితే రైతుకు పెట్టుబడి తిరిగి రావడంతో పాటు, ఆర్థిక భద్రత కలుగుతుంది. బీమా ప్రీమియం చెల్లించిన వారికి పరిహారం అందేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏ ఒక్కరికీ నష్టం జరగకూడదు.

బీమా కంపెనీలు కూడా పారదర్శకంగా, నిజాయితీగా పనిచేయాలి.’ అని సీఎం అన్నారు.

నెలాఖరు కల్లా సీసీఈల ఏర్పాటు

‘పంటల బీమా అందకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. మొత్తం 30,286 సీసీఈలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటిని నవంబర్‌ నాటికి అందుబాటులోకి తీసుకురావాలి.

రాష్ట్రంలో రెండేళ్లకోసారి, కొన్నిసార్లు ఐదేళ్లకోసారి తుఫాన్లు సంభవిస్తున్నాయి. వీటి కారణంగా రైతులు పెట్టిన పెట్టుబడిని కూడా తిరిగి పొందలేకపోతున్నారు. రైతులకు పెట్టుబడి తిరిగి వచ్చేలా భరోసా కల్పిస్తే నష్టాల నుంచి బయటపడగలుగుతారు.

ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమాను సమన్వయం చేస్తే రైతులకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుంది. రైతుల్లో పంటల బీమాపై అవగాహన, ఆమోదం కల్పించగలిగితే వారు బీమా ప్రీమియం చెల్లించేందుకు ముందుకొస్తారు. తద్వారా వారికి ఆర్థిక భద్రత కలుగుతుంది.

ఈ నెలలోనే అన్ని అవగాహన కార్యక్రమాలను పూర్తి చేయాలి. అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తున్న రూ.20,000 ఎంతలా ఉపయోగపడుతుందో... బీమా కూడా రైతును ఆదుకోవడంలో దోహదపడుతుంది.’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

అగ్రి యాప్‌తో విస్తృత ప్రయోజనాలు

‘రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులు ఉంటే.. 20 లక్షల మంది అగ్రి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 10 లక్షల మంది నిత్యం వినియోగిస్తున్నారు. యాప్ ద్వారా అన్నిరకాల సేవలు అందుతున్నాయి. దీనిని మరింత వినియోగించుకోవాలి.

యాప్‌ ఆధారంగానే పంటల రుణాలు అందించే విధానం ఉండాలి. పంట నష్టానికి సంబంధించిన వివరాలన్నింటినీ అగ్రి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. వ్యవసాయ అధికారులపై గురుతర బాధ్యత ఉంది.

ఎన్నికలు ఉన్నప్పటికీ రైతులకు సంబంధించిన ఈ పనులపైనే దృష్టి సారిస్తున్నాం. నమ్ముకున్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగులు అద్భుతంగా పనిచేస్తున్నారు...వారిని అభినందిస్తున్నాను.

బీమా విషయంలోనూ సమర్థత చాటుకోవాలి.’ అని సీఎం సూచించారు.