అమరావతి, అక్టోబర్ 22: రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) 22వ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, నారాయణ, కందుల దుర్గేష్ వర్చువల్గా హాజరయ్యారు.
పరిశ్రమలు, ఇంధన శాఖ, పర్యాటకం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో వివిధ పెట్టుబడి ప్రతిపాదనలపై ఎస్ఐపీబీలో చర్చ జరిగింది.
గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు పెట్టుబడులుగా మారి ఉత్పత్తి ప్రారంభించే అంశంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. మొత్తం 714 ఒప్పందాల్లో 519 ప్రాజెక్టులకు సంబంధించి కార్యాచరణ ప్రారంభించినట్టు అధికారులు వెల్లడించారు.
పెట్టుబడుల సదస్సు నిర్వహించేందుకు వీలుగా విశాఖలో ఓ అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్లో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు కీలకమని ముఖ్యమంత్రి అన్నారు.
లాజిస్టిక్స్ హబ్లో భాగంగా పోర్టులు, ఎయిర్ పోర్టులతో పాటు ఈస్ట్ వెస్ట్ కనెక్టివిటీపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. సెమీ కండక్టర్ రంగంలో తయారీ యూనిట్లతో కూడిన ఎకోసిస్టం రాష్ట్రంలో ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి అన్నారు.
