అనకాపల్లి జిల్లాలో నూతన 4 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ — విలేజ్ హెల్త్ క్లినిక్‌లను వర్చువల్ విధానంలో ప్రారంభించిన మంత్రి సత్య కుమార్ యాదవ్; శిలాఫలకాలు ఆవిష్కరించిన కలెక్టర్ విజయ కృష్ణన్

అనకాపల్లి, అక్టోబర్ 6 (ఎక్స్‌ప్రెస్ టుడే): గర్భిణులు, బాలింతలు, శిశువులకు వైద్య సేవలు సకాలంలో అందేలా వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పేర్కొన్నారు.

మంగళవారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం జనార్ధనపురం నుండి అనకాపల్లి జిల్లాలో నూతన 4 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నాలుగు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ — విలేజ్ క్లినిక్ భవనాల శిలాఫలకాలను కలెక్టర్ విజయ కృష్ణన్ జ్యోతి ప్రజ్వలన చేసి ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చడంలో విలేజ్ హెల్త్ క్లినిక్‌లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పారామెడికల్ సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో 96 విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, వాటిని వేగవంతం చేసి డిసెంబర్ నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో పెదపాడులో రూ.32 లక్షలతో, కాజీపాలెంలో రూ.32 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్‌లు; నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మండలంలోని ధర్మసాగరం గ్రామంలో రూ.24 లక్షలతో; పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలంలోని చౌడువాడ గ్రామంలో రూ.26 లక్షలతో ఏర్పాటుచేసిన విలేజ్ క్లినిక్ భవనాలను మంత్రి సత్య కుమార్ యాదవ్ వర్చువల్ విధానంలో ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు.

జిల్లాకు నూతనంగా మరో నాలుగు విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు కావడం సంతోషదాయకమని, ప్రజలు వీటిని ఉపయోగించుకుని ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలని అన్నారు. డాక్టర్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు మరింతగా అందించాలని కోరారు. త్వరలో మరో 96 విలేజ్ క్లినిక్‌లు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.