రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం ప్రారంభం — సుమారు రూ.2 కోట్లతో ఆధునీకరణ, ఎన్టీపీసీ సీఎస్ఆర్ సహకారం
అనకాపల్లి, అక్టోబర్ 5 (ఎక్స్ప్రెస్ టుడే): యువత క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇండోర్ స్టేడియం ఎంతగానో దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అనకాపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇండోర్ స్టేడియంను సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎన్టీపీసీ ఈడీ అయస్కాంత్ జెనాలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ, ఇండోర్ స్టేడియం అనకాపల్లి ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. యువత క్రీడల్లో రాణించేందుకు, తమ ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇండోర్ స్టేడియంను ప్రతి ఒక్కరూ తమ సొంత ఆస్తిగా భావించి జాగ్రత్తగా, సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా స్టేడియం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రభుత్వ, ప్రజా ఆస్తులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు.
మెరుగైన క్రీడా సదుపాయాలు
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ, అనకాపల్లి పట్టణ ప్రజలకు మెరుగైన క్రీడా సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంలో రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం కీలకంగా నిలుస్తుందని అన్నారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. స్టేడియంలోని సౌకర్యాలను నిబంధనల ప్రకారం వినియోగించుకుంటూ వాటి నిర్వహణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, అనకాపల్లి ప్రాంతంలో క్రీడా మౌలిక వసతులను బలోపేతం చేయడంలో ఈ ఇండోర్ స్టేడియం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు, క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, సాధనకు ఈ సదుపాయం ఉపయోగపడుతుందని అన్నారు. స్టేడియంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎన్టీపీసీ సీఎస్ఆర్ సహకారం
ఎన్టీపీసీ సింహాద్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయస్కాంత్ జెనా మాట్లాడుతూ, అనకాపల్లిలో క్రీడా మౌలిక వసతులను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని జిల్లా యంత్రాంగం గుర్తించడంతో, ఎన్టీపీసీ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమంలో భాగంగా రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం పునరాభివృద్ధికి సహకరించిందని తెలిపారు. సుమారు రెండు కోట్ల రూపాయలతో స్టేడియంను ఆధునిక క్రీడా సదుపాయంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.
