అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద రూ.22.09 కోట్లతో నిర్మించిన ఈ కేంద్రాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌లు వర్చువల్‌గా ప్రారంభించారు.
- ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద రూ.22.09 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభం
- అదనంగా రూ.7.50 కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటు
- ప్రస్తుత 220 పడకల నుంచి 400కుపైగా పడకలకు విస్తరణకు రూ.6.70 కోట్లతో ప్రతిపాదనలు
- అనకాపల్లికి ఈఎస్ఐ వైద్య కళాశాల కోసం కృషి చేస్తామన్న ఎంపీ సీఎం రమేష్
అనకాపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, కార్పొరేషన్ చైర్మన్లు, కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
గోల్డెన్ అవర్‌లో ప్రాణాలు కాపాడేలా..
క్రిటికల్ కేర్ సెంటర్ అందుబాటులోకి రావడం అనకాపల్లి జిల్లా ప్రజారోగ్య రంగంలో కీలక ముందడుగని ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. ప్రమాదాలు, గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులు, ఇతర క్లిష్టతర వ్యాధులతో బాధపడుతున్న వారికి సకాలంలో అత్యవసర వైద్యం అందించే అవకాశం ఏర్పడిందని, ప్రాణాలను కాపాడటంలో అత్యంత కీలకమైన గోల్డెన్ అవర్లోనే చికిత్స అందించేందుకు ఈ కేంద్రం దోహదపడుతుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను విశాఖపట్నానికి తరలించాల్సిన అవసరం తగ్గడంతోపాటు, పేదలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. అత్యవసర వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లా ప్రజలకు అవసరమైన అన్ని ప్రధాన వైద్య సేవలు స్థానికంగానే అందేలా జిల్లా ఆసుపత్రిని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
క్రిటికల్ కేర్ సెంటర్‌కు అదనంగా రూ.7.50 కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి రానున్నాయని, వీటితో అత్యవసర వైద్య సేవలకు అవసరమైన మౌలిక వసతులు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. భవిష్యత్తులో 20 పడకల కిడ్నీ డయాలసిస్ సేవలను విస్తరించడంతో పాటు ఆసుపత్రిలోని అన్ని విభాగాలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.
ఇతర సదుపాయాల విస్తరణ
పరిశ్రమలకు సీఎస్ఆర్ నిధుల సహకారంతో జిల్లా ఆసుపత్రిలో ఆరు ఆపరేషన్ థియేటర్లు, పలు ఆధునిక వైద్య పరికరాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. గైనకాలజీ విభాగంలో రూ.36 లక్షల విలువైన స్కాన్, కంటి వైద్య విభాగంలో రూ.40 లక్షల విలువైన అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. డీ-అడిక్షన్ సెంటర్, వెయిటింగ్ హాల్ ఏర్పాట్లు పూర్తయ్యాయని, మూడు మృతదేహాలను భద్రపరిచే సామర్థ్యంతో మార్చురీని ఆధునికీకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో 220 పడకల సామర్థ్యం ఉందని, భవిష్యత్తులో 400కుపైగా పడకలకు విస్తరించేలా రూ.6.70 కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎంపీ, ఎమ్మెల్యే తెలిపారు. దశలవారీగా ఆసుపత్రి భవనాలను ఆధునికీకరించి, రోగులకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఎంఆర్ఐ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు.
అనకాపల్లి పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో జిల్లాకు ఈఎస్ఐ వైద్య కళాశాలను తీసుకురావడానికి కృషి చేస్తామని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. పరిశ్రమలు, కార్మికులు, వారి కుటుంబాల అవసరాలకు అనుగుణంగా వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జిల్లా ఆసుపత్రికి అవసరమైన నిధులు, వైద్య పరికరాలు సమకూర్చేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించవచ్చని, ప్రజలు వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అనకాపల్లిలోనే అన్ని ప్రధాన వైద్య సేవలు అందేలా చేయడమే తమ సంకల్పమని స్పష్టం చేశారు.
