చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగులను పంచే దివ్యదీపం ఉపాధ్యాయుడని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ పేర్కొన్నారు. శనివారం ఉదయం ఎస్.ఆర్.శంకరం సమావేశం మందిరంలో అత్యంత వైభవంగా జిల్లాస్థాయి గురుపూజోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మరియు శాసనసభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జ్యోతి ప్రజ్వలన అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాకుండా, విద్యార్థుల జీవితాల్లో జ్ఞానదీపాలను వెలిగించే బాధ్యతకు ప్రతీక అని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని, వారి నిరంతర కృషి వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయని చెప్పారు. గత రెండేళ్లలో చేపట్టిన ప్రత్యేక ప్రచార కార్యక్రమాల వల్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 2.04 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు.
తల్లికి వందనం, మౌలిక సదుపాయాలకు నిధులు
విద్యార్థుల చదువును ప్రోత్సహించేందుకు 'తల్లికి వందనం' పథకం కింద జిల్లా పరిధిలో రూ. 301 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 10 కోట్లు, ఎస్ఎంసి (SMC) గ్రాంట్ల కింద రూ. 5.19 కోట్లు విడుదల చేసి వసతులు మెరుగుపరిచామని చెప్పారు. పదో తరగతి ఫలితాలు 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక ద్వారా 90% పైగా ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, వెనుకబడిన వేలాది మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తీర్ణులను చేసిన ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
వ్యాయామ (PT) పీరియడ్లలో మ్యాథ్స్, సైన్స్ వంటి సబ్జెక్టులు చెప్పకూడదని, ఆ సమయంలో పిల్లలను మైదానంలో ఆడుకోనివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆటల ద్వారా గెలుపోటములను సమానంగా స్వీకరించే మానసిక స్థైర్యం, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతాయని స్పష్టం చేశారు. పిల్లలు రోజులో 8 నుండి 9 గంటల సమయం ఉపాధ్యాయులతోనే గడుపుతారని, ఉపాధ్యాయులు చెప్పే ప్రతి మాటను నిజమని నమ్ముతారని పేర్కొన్నారు. కాబట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, మంచి నైతిక విలువలను పెంపొందించేలా ప్రోత్సహించాలని సూచిస్తూ, జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రసంగం
శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, పదవ తరగతి విద్యార్థుల కోసం అమలు చేసిన 100 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా 90% ఉత్తీర్ణత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మొదట్లో వెనుకబడిన సుమారు 2,000 మంది విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించగా, ఉపాధ్యాయుల కృషి వల్ల వారిలో 1,000 మందికి పైగా విద్యార్థులు తిరిగి ఉత్తీర్ణులయ్యారని, మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు చేపట్టిన ప్రత్యేక ప్రచార కార్యక్రమాల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని తెలిపారు. షైనింగ్ స్టార్ అవార్డుల కింద ప్రతిభ కనబరిచిన 158 మంది విద్యార్థులకు రూ. 3 కోట్ల విలువైన అవార్డులను పంపిణీ చేశారు.
ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ ఎక్స్పోజర్ ట్రిప్
గొల్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక విజ్ఞాన ఉపాధ్యాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులు, విద్యా విధానాలపై అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో చేపట్టిన "ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ ఎక్స్పోజర్ ట్రిప్" అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు. 'లీప్' పరీక్ష ద్వారా ఎంపికై ఈ పర్యటనలో పాల్గొన్న ఆయన, తమ అధ్యయన వివరాలను వెల్లడించారు. ఫిన్లాండ్ పర్యటనకు ముందు విజయవాడలో 5 రోజుల పాటు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించగా, ఉపాధ్యాయులందరూ 6 బృందాలుగా విడిపోయి ఫిన్లాండ్ విద్యా వ్యవస్థపై ప్రాథమిక అసైన్మెంట్లు, అధ్యయనం పూర్తి చేశారు.
ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా 8 రోజుల పాటు వివిధ పాఠశాలలను సందర్శించగా, అక్కడి 'ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్' విధానం ఎంతగానో ఆకట్టుకుందని, చిన్నతనంలోనే పిల్లలకు ప్రవర్తన, వ్యక్తిత్వ వికాసంపైనే అక్కడ ప్రధానంగా దృష్టి సారిస్తున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో కూడా అంగన్వాడీ కేంద్రాల స్థాయి నుంచే విద్యా పునాదులను మరింత బలోపేతం చేస్తే, ప్రాథమిక విద్యలో విప్లవాత్మక మార్పులు సాధించవచ్చని స్పష్టం చేశారు. ఫిన్లాండ్ విద్యా వ్యవస్థపై అధ్యయనం పూర్తి చేసిన గోపీనాథ్ (శివరాంపురం), పి.వి.ఎం. నాగజ్యోతి (స్కూల్ అసిస్టెంట్, రోలుగుంట), ఎల్.వి. నారాయణరావు (స్కూల్ అసిస్టెంట్, గొల్లుపాలెం) ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డును అందజేశారు. పాఠశాల విద్యార్థుల అభ్యున్నతికి, విద్యా రంగానికి విశేష సేవలు అందించిన హెడ్ మాస్టర్లు, పాఠశాల సహాయకులు మరియు ఎస్జీటీ ఉపాధ్యాయులను వేదికపై శాలువాలు, ప్రశంసా పత్రాలు మరియు మెమెంటోలతో ఘనంగా సన్మానించారు.
