అనకాపల్లి, సెప్టెంబర్ 23: రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అచ్చుతాపురం మండలం, ఎం. జగన్నాధపురం గ్రామంలో వరినాట్లు వేసిన పొలాలను కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వరి విత్తనాలకు విత్తన గుళికలు (సీడ్ పెలటైజేషన్) చేయడం, వాటి ఉపయోగాల గురించి డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్ లచ్చన్న రైతులకు వివరించి చెప్పారు. అలాగే వరి పొలంలో అనుబంధ పంటలుగా పెసర, మినుము విత్తనాలను గుళికలుగా చేసి వేయడం వలన అవి భూమిలో కుళ్లి ఎరువుగా తయారై వరి పంటకు మంచి దిగుబడి వస్తుందని రైతులకు వివరించారు.

రైతులు ప్రకృతి వ్యవసాయం గురించి కలెక్టర్‌కు వివరిస్తూ, తమ గ్రామంలో అందరూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు.