అనకాపల్లి, సెప్టెంబర్ 23: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆమె అచ్చుతాపురం, రాంబిల్లి మండలాల్లో పర్యటించారు.
రాంబిల్లి సెజ్‌లో దాదాపు 125 ఎకరాల స్థలంలో అత్యాధునిక ఆటోమేషన్ సాంకేతికతతో నిర్మిస్తున్న యాక్షన్ టెసా ప్లాంట్‌ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం రూ.2,300 కోట్ల భారీ పెట్టుబడితో నెలకొల్పుతున్న బ్లూ జెట్ హెల్త్‌కేర్ సంస్థను కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పరిశ్రమల నెలకొల్పేందుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించడమే కాకుండా పనులు ఎంత మేర జరుగుతున్నాయనే వివరాలను కూడా తెలుసుకుంటుందని అన్నారు. లైన్ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ సహాయంతో పరిశ్రమ నెలకొల్పేందుకు పనులు వేగవంతం చేయాలని, ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని కోరారు.
అనకాపల్లి జిల్లా, వైజాగ్ పోర్ట్ కనెక్టివిటీ, తగినంత భూ లభ్యత, నైపుణ్యం ఉన్న మానవ వనరుల కారణంగా పారిశ్రామిక వృద్ధికి ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు.
