తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం

‘జల్ జీవన్ మిషన్ 2.0-అమరజీవి జలధార’ పనులను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రూ.30,156 కోట్లతో ప్రొద్దుటూరు నుంచి జల్ జీవన్ మిషన్ పనులు ప్రారంభం

అమరావతి, అక్టోబర్ 4 (ఎక్స్‌ప్రెస్ టుడే): గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ కూటమి ప్రభుత్వం మరో కీలకమైన ముందడుగేసింది. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ద్వారా సురక్షితమైన తాగునీరు అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీ అమలుకు ప్రభుత్వం నడుం బిగించింది.

జల్‌ జీవన్‌ మిషన్‌ పనులను రాష్ట్రంలో మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ‘జల్ జీవన్ మిషన్ 2.0–అమరజీవి జలధార’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కలిసి సోమవారం ప్రొద్దుటూరులో ఈ పనులను ప్రారంభించనున్నారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి ఇంటి వద్దే సురక్షితమైన నీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం భారీ స్థాయిలో ఈ పనులను చేపడుతోంది.

మరో 27 లక్షల కుటుంబాలకు తాగునీటి సౌకర్యం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 4,933 ఆవాసాల్లో 7.44 లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లను అందించింది. ‘అమరజీవి జలధార’లో భాగంగా మరో 27 లక్షల కుటుంబాలకు తాగునీటి సదుపాయం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటింటికీ నీటిని అందించాలంటే కేవలం కుళాయి కనెక్షన్లు ఇస్తే సరిపోదని భావించిన ప్రభుత్వం.. నీటి వనరులు, శుద్ధి కేంద్రాలు, నిల్వ సామర్థ్యం, పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌, నిర్వహణ వ్యవస్థను సమగ్రంగా ఉండేలా చర్యలు చేపట్టింది.

గత ప్రభుత్వంలో జేజేఎం పథకం నిర్వీర్యం

గత ప్రభుత్వం అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు ప్రజలకు తాగునీరు అందించే జల్ జీవన్ మిషన్ పథకాన్నీ నిర్వీర్యం చేసిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 2019లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమయంలో అనేక రాష్ట్రాలు పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకున్నాయి. ఉత్తరప్రదేశ్ రూ.1 లక్ష కోట్లు, రాజస్థాన్ రూ.85 వేల కోట్లు, మధ్యప్రదేశ్ రూ.83 వేల కోట్లు, కర్నాటక రూ.63 వేల కోట్లు, అస్సాం రూ.34 వేల కోట్లు జల్ జీవన్ మిషన్ కింద తీసుకున్నాయి.

అయితే గత వైసీపీ ప్రభుత్వం మాత్రం కేవలం రూ.26 వేల కోట్లకు మాత్రమే ప్రతిపాదనలు పంపి 5 ఏళ్ల కాలంలో రూ.2,600 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని, అది కూడా జలాశయాల నుంచి శాశ్వతంగా నీరందేలా కాకుండా బోర్ల ద్వారా తాత్కాలికంగా వచ్చేలా చేపట్టిందని పేర్కొన్నారు. నిరంతరాయంగా ప్రజలకు తాగునీరు అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2024లో అధికారంలోకి వచ్చాక కేంద్రంతో మళ్లీ సంప్రదింపులు జరిపి పథకం గడువును 2028 నాటికి పొడిగించేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేశారు. జల్ జీవన్ మిషన్ 2.0–అమరజీవి జలధార పనులను ప్రొద్దుటూరు నియోజకవర్గం ఎమ్.ఎమ్.పల్లి నుంచి ప్రారంభించనున్నారు.